ఆమనగల్లు, జనవరి 30: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని నుచ్చుగుట్టతండా, సాకిబండతండాల్లో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూ సర్వేను గిరిజన రైతులు అడ్డుకున్నారు. ‘మా పొలా లు మాగ్గావాలె’ అని నినదించడంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమనగల్లు మండలాల మీదుగా ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డును అనుసంధానం చేస్తూ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. గురువారం ఆయా తండాల్లో భూ సర్వే చేసేందుకు కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి, అధికారులు రాగా రైతులు పొలాల్లో బైఠాయించారు. ‘వద్దురా నాయనా రేవంత్‌రెడ్డి పాలన.. జై జవాన్, జై కిసాన్, ఇదేమీ రాజ్యం-దొంగల రాజ్యం, మా భూములు మాగ్గావాలె’ అని నినదించారు. దీంతో అన్నదాతలకు నచ్చజెప్పేందుకు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి ప్రయత్నించారు.
రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను గుర్తించేందుకు మాత్రమే ఎంజాయ్మెం ట్ సర్వే చేపడుతున్నామని, రైతులను గుర్తించి గ్రామసభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 490 ఎకరాలు గుర్తించామని, 1.5 కిలోమీటర్లు మాత్రమే సర్వే చే యాల్సి ఉందని, 2013 భూ సేకరణ చట్టం ప్ర కా రం ప్రభుత్వం పరిహారం చెలిస్తుందని తెలిపారు. అయినప్పటికీ, రైతులు వెనక్కి తగ్గలేదు. ‘మాకున్న కొద్దిపాటి భూములను లాక్కుంటే ఎలా బతకాలి? పట్టణాలకుపోయి రిక్షాలు తొక్కాలా? కంపెనీల్లో జీతాలు ఉండాలా? మా గోసను అర్థం చేసుకుని మా భూములను లాక్కోవద్దు’ అని అధికారులను వేడుకున్నారు. భూములను బలవంతంగా లా క్కుంటే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘ముఖ్యమంత్రి మా ప్రాంతం వ్యక్తి అయ్యి ండు. మా ప్రాంతం బాగుపడుతుందని అనుకున్నం. కానీ, మా జీవితాల్లో పెద్ద బండరాయే వేసిండు’ అని అన్నదాతలు వాపోయారు. సర్వేను వెంటనే నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగారు.
గిరిజన రైతులకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. ఆమనగల్లు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గిరిజన రైతులకు మద్దతు పలికారు. కాగా, సీఐలు ప్రమోద్‌కుమార్, శివప్రసాద్, నరహరి, ఎస్ శ్రీకాంత్ నేతృత్వంలో పోలీసులు, ప్రత్యేక బలగాలతో బందోబస్త్ చేపట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డికి మా గిరిజనులంటే గిట్టదు. గతంలో లగచర్లలో గిరిజన రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేసిండు. అక్కడ మా గిరిజన బిడ్డలు తిరగబడితే వాళ్లను జైల్లో పెట్టించిండు. అది సరిపోనట్టు మళ్లీ మా భూముల మీద పడ్డడు. మాకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వద్దు. మా గిరిజన బిడ్డలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకుంటలేడు. దీన్నిబట్టి సీఎం రేవంత్ గిరిజనులపై కక్ష్య కట్టిండని అర్థమవుతున్నది.
– నేనావత్ పత్యానాయక్, ఆమనగల్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న రైతులతో మొదట సమావేశం పెడుతామని, ఆ తర్వాతే సర్వే చేస్తామని మాయమాటలు చెప్పి.. గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల పహారాలో సర్వే చేయడం సరైన విధానం కాదు. మేం గిరిజనులం, బలహీనులం, ఏం చేయలేమనే ఉద్దేశంతో మాపై, మా భూములపై అజమాయిషీ చేస్తున్నారు. మా ప్రాణాలైన తీసుకుంటాం కానీ, భూములను వదులుకోం.
ఈ ప్రాంతంలో గిరిజనులు తమకు న్న పావు ఎకరా, అద్ద ఎకరా, ఎకరా భూ ముల్లో సేద్యం చేసుకుంటూ జీవితం వెళ్లదీస్తుర్రు సారు. ఉన్న భూములను గుం జుకుంటే మా గిరిజన బిడ్డలు పట్నంకు వలసపోయి జీతాలుండాలా? ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న గిరిజనులను మళ్లీ వందల ఏండ్లు వెనక్కి తీసుకుపోతుర్రు.
-రమేశ్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, గిరిజన నాయకుడు