మక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా నర్సాపూర్, దిలావర్పూర్ మండలాలకు చెందిన రైతులు గుండంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డుపై ముళ్ల కంప వేసి ధర్నా చేపట్టారు. సుమారు నాలుగు గంటలకుపైగా కొనసాగిన ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. తహసీల్దార్ శ్రీకాంత్ కలెక్టర్‌కు ఫోన్ కలిపి రైతు రమణారెడ్డితో మాట్లాడించారు. మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు నిరసనను విరమించారు.
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు ధర్నా చేశారు.

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనేదిక్కు లేదని మండిపడ్డారు. వర్షాలు పడితే కల్లాల్లో ధాన్యం కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలో రెండు రోజులు మాత్రమే తూకం వేసి తిరిగి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు దిగాలుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ధాన్యం కుప్పలు చోరీకి గురువుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో సభ్యులతో రాత్రంతా కాపలా ఉన్నది.

‘మీకు పాదాభివందనం చేస్తాం. దయచేసి మక్కలు కొనేలా చర్యలు తీసుకోండి’ అని జగిత్యాల మార్క్‌ఫెడ్ డీఎం హబీబ్‌కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విజ్ఞప్తి చేశారు. బుధవారం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరి, మక్క రాశులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్ల్లబోసుకున్నారు.

కొనుగోలు చేసిన మక్కలను లారీల్లో తరలించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి బైఠాయించారు. 20 రోజులుగా సొంత డబ్బులు వెచ్చించి గన్నీ సంచుల్లో మక్కలు నింపినా వాహనాలను సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెల రోజులైనా కాంటా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్‌పహాడ్‌లో జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం కష్టపడితే కూలన్న గిట్టొద్దా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

కొనుగోలులో తాత్సారాన్ని నిరసిస్తూ బుధవారం జగిత్యాల బీట్ ఎదురుగా రహదారిపై రైతులు ధర్నా చేశారు. మక్కలు తెచ్చి పది రోజులైనా కొనడం లేదని మండిపడ్డారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్ యార్డులోనే కాపలా కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదనచెందారు.

రేవంత్‌రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేకి అని, రైతులను గోస పెడితే ఊరుకోమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో కిలో కూడా అదనంగా తూకం వేస్తలేరని చొప్పదండి ఎమ్మెల్యే నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను స్వీకరించేందుకు సుంకె రవిశంకర్ బుధవారం కొండగట్టుకు వెళ్తుండగా, మల్యాల ఎస్సై ఆయన్ను అడ్డుకున్నారు.
అకాల వర్షాలతో కండ్లముందే ధాన్యం నీటి పాలవుతున్నా.. ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రైతులు అధికారులపై మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం రైతు వేదికలో ధాన్యం, మక్కజొన్న కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కష్టాన్ని కండ్లకు కట్టినట్టు వివరించారు.