దిలావర్పూర్, డిసెంబర్ 12: తమ పొట్టగొట్టే, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇథనాల్ పరిశ్రమను దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మించొద్దని రెండు గ్రామాల రైతులు మంగళవారం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని ముట్టడించారు. పరిశ్రమ స్థలంలో రైతులు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు ఆందోళన చేపట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. తమకు ఈ ప్రాంతంలో పరిశ్రమ వద్దని తేల్చి చెప్పారు. ఆయా పార్టీల నాయకులు రైతుల పక్షాన మాట్లాడారు. పరిశ్రమను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల తమ ఆరోగ్యాలు చెడిపోతాయని, పంటలు సాగుకు నోచుకోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఆయా గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.