మునుగోడు, మే 28 : మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో పంట మార్పిడి విధానంపై వ్యవసాయ విస్తరణ అధికారి మాదగోని నర్సింహ్మ గౌడ్ రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట మార్పిడి చేసినట్లయితే భూమి సారవంతం అవుతుందని, పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. రైతులు పత్తి విత్తనాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి రైతు విత్తనాలు కొనేటప్పుడు బిల్లులు కచ్చితంగా తీసుకోవాలని, బిల్లులపై ముద్రించిన వివరాలు విత్తన ప్యాకెట్ పైన ముద్రించి వచ్చినవా లేదా చూసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.
మంచి వర్షాలు పడిన తర్వాత భూమిలో పదును ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు వేసుకోవాలని, తొందరపడి విత్తనాలు విత్తుకోకూడదన్నారు. భూమి ఉన్న ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు రైతు ఆధార్ కార్డు నంబర్‌తో ఆధార్‌కు లింక్ ఉన్న ఫోన్ నంబర్‌ను ఏఈఓ వద్దకు తీసుకువచ్చి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.