హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని విజయ పాడి రైతులు డిమాండ్ చేశారు. గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించేవారని, ఇప్పుడు సకాలంలో చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పాడి రైతుల పరిరక్షక సంఘం అధ్యక్షుడు సాదం రమేశ్ విజయ డైరీ ఎండీకి లేఖ రాస్తూ ‘బిల్లులు రాక పాడి రైతులు చాలా ఇబ్బందు లు పడుతున్నారు. పశువులకు దానా కూడా కొనలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ 3 బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. వెంటనే బకాయిలను విడుదల చేయండి. గతంలో మాదిరిగా 15 రోజులకోసారి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోండి’ అని కోరారు.
21న కేఆర్ఎంబీ మీటింగ్
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం వచ్చే నెల 21న జరుగనున్నది. ఈ నెల 3న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల అభ్యంతరాలతో వాయిదా పడింది. జనవరి 21న సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కేఆర్ఎంబీ సోమవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. మీటింగ్ ఎజెండా కూడా ఖరారు చేసింది. తెలంగాణ తరఫున 13 అంశాలు, ఏపీ తరఫున ఐదు అంశాలను ఎజెండాలో చేర్చారు. కృష్ణా బేసిన్లో ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపడంపై బోర్డు మీటింగ్లో చర్చించాలని తెలంగాణ కోరింది. రాజోలిబండ డైవర్షన్ సీమ్(ఆర్డీఎస్) ఆధునికీకరణకు అనుమతించాలని, సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు అప్పగించాలనే పలు అంశాలను ఎజెండాలో రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు.