ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. తలమడుగు మండలంలోని దేవాపూర్‌కు చెందిన రైతు జగ్గిడి రాములు కుటుంబసభ్యులు తమ చేలకు దారి వేయాలంటూ ఎడ్లబండిపై 12 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమ కుటుంబంలో నలుగురుకి కలిసి 12 ఎకరాల భూమి ఉందని, పక్క పొలాల వారు దారి ఇవ్వకపోవడంతో తాము వ్యవసాయం చేసుకొనే పరిస్థితి లేదని వాపోయారు. మండల రెవెన్యూ అధికారులకు సమస్య తెలియజేసినా పరిష్కారం కాలేదని తెలిపారు. తలమడుగు తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్ పొలానికి దారి వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాన్ టీచింగ్ సిబ్బంది సోమవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వాచ్‌మన్, స్వీపర్లు, శానిటరీ కార్మికులను యథావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీకి అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నారాయణపేట జిల్లా ధన్వాడ ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మూడేండ్ల నుంచి బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.