టేకులపల్లి/ కోటపల్లి/ కొత్తగూడ, జూలై 23 : రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. బుధవారం కురిసిన వర్షంలోనూ రైతులు పలుచోట్ల బారులుతీరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని బోడ్ క్రాస్‌రోడ్ సెంటర్లో ఏఐకేఎంఎస్, న్యూడెమోక్రసీ నాయకులతో కలిసి రైతులు ఆందోళనకు దిగారు.
సరిపడా యూరియా అందించాలని, టేకులపల్లి, బొమ్మనపల్లి, బోడు గ్రామాల్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఐఎఫ్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే సరిపడా యూరియాను సరఫరా చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మంచిర్యాల కోటపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూకట్టారు. కోటపల్లిలోని పీఏసీఎస్‌లోని యూనియా పంపిణీ కేంద్రానికి రైతులు బుధవారం ఉదయమే చేరుకున్నారు. వర్షంలో తడుస్తూ పడిగాపులు కాశారు. ఎకరానికి ఒక్క బస్తా మాత్రమే ఇవ్వడంతో రైతులు నిరాశకు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని పొగుళ్లపల్లి సొసైటీ వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులు గొడుగులు పట్టుకొని, కవర్లు వేసుకొని క్యూలో నిలబడ్డారు.