మక్తల్/పరకాల/కోటపల్లి/ఇల్లెందు, జూలై 17 : కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చుంటున్నారు. పొద్దంతా ఉన్నా సరిపోను యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంత్రుల ఇలాకాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నా సర్కార్ స్పందించడం లేదు. పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా మక్తల్‌లో యూరియా కొరత ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిత్యం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా యూరియా లేదని చెప్తుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. గురువారం నుంచి యూరియా పంపిణీ చేస్తామని అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పట్టణంలోని పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు పట్టా పాస్‌పుస్తకాల జిరాక్స్ కాపీలు, కవర్లను క్యూలైన్లో ఉంచారు. 1050 బస్తాలు రావడంతో కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడే పడిగాపులు కాశారు.
చాలా మందికి అందకపోవడంతో వెనుదిరిగారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు దాపురించాయని పలువురు ఆవేదన చెందారు. హనుమకొండ జిల్లా పరకాలలో రైతులు చెప్పులను క్యూలో పెట్టి నిరీక్షించారు. ఇన్ని తిప్పలు పడ్డా యూరియా దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున అందజేశారు. ఎరువుల కొరతను నిరసిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి వివేక్, ఎంపీ వంశీ చొరవ తీసుకొని రైతులకు సరిపడా ఎరువులు అందించేలా చూడాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఎరువుల గోడౌన్ వద్దకు భారీగా చేరుకున్న రైతులతో కలిసి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు నిరసన తెలిపారు. రైతులు పొలం పనులు వదులుకొని యూరియా కోసం ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు మండిపడ్డారు.