సిరిసిల్ల టౌన్, జూన్ 10: ‘నా పొలంలో లూజ్ వైర్లను తొలగించి విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేస్తారా? లేక చావమంటారా?’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు గంధం రమేశ్ సిరిసిల్లలోని సెస్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వ్యవసాయ భూమిలో వైర్లు వేలాడుతున్నాయని, గతం లో రెండు సార్లు తనతోపాటు తన భార్య కూడా విద్యుత్తు షాక్కు గురైనట్టు తెలిపాడు. కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని గతంలోనే డబ్బులు చెల్లించానని, ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించడం లేదని విమర్శించాడు. తిరిగి రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డాడు.
అడ్డా కూలీగా పని చేసే తాను పది వేలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించాడు. ఇదేంటని అడిగితే ‘చస్తే చావుపో.. మాకేంటి?’ అని అధికారులు దురుసుగా మాట్లాడుతున్నారని వాపోయాడు. గతంలో తన వద్ద రూ.20 వేలు తీసుకుని 150 గజాలకు ఒక స్తంభం వేశారని చెప్పాడు. ప్రభుత్వం మేల్కొని తనలాంటి రైతులను కాపాడాలని వేడుకున్నాడు. తనకు న్యాయం జరగకపోతే ఇక్కడే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. సీఎం రేవంత్రెడ్డి, కలెక్టర్ స్పందించి తనలాంటి నిరుపేద రైతులకు న్యాయం చేయాలని కోరాడు.