కరీంనగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ సర్కారు (Congress Govt) అలసత్వం మరోసారి రైతుల పాలిట శాపంగా మారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు మళ్లీ నష్టాల మూటే మిగలనుంది. వానకాలం కోతలు ఇప్పటికే మొదలైనా.. సర్కారు ఇంకా కొనుగోలు కేంద్రాలనే (Paddy Procurement) ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొన్నది. ఈ నెల ఒకటి నుంచే కేంద్రాలను ప్రారంభిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అత్యధిక ప్రాంతాల్లో నేటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనేలేదు. కొన్నిచోట్ల ఆర్భాటంగా రిబ్బన్ కట్‌చేసినా కోనుగోళ్లు మాత్రం చేపట్టడంలేదు. దీంతో పలుచోట్ల కేంద్రాల వద్ద రైతులు 20 రోజులుగా పడిగాపులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆయా కేంద్రాలకు మిల్లులు అలాట్మెంట్ చేయడంలో అధికార యంత్రాగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఈ సమస్యపై జిల్లాల ఇన్చార్జి మంత్రులు కనీసం సమీక్షలు చేసిన పాపాన పోలేదు. మరోవైపు వర్షాలొస్తాయని వాతావారణ శాఖ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో ఆన్నదాతల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి ఏర్పడింది. బోనస్‌కు ఎగనామం పెట్టేందుకే కొనుగోలు కేంద్రాల ప్రారంభ విషయంలో కాంగ్రెస్ సర్కారు అలసత్వం చూపుతున్నదన్న విమర్శలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
అడుగడుగునా ప్రణాళికాలోపం
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలు కలిపి ఈ సీజన్లో 19.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకోసం మొత్తం 1,314 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటివరకు కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేళ్లపై లెక్కపెట్టే స్థాయిలోనే కేంద్రాలను ప్రారంభించారు. మిగతా జిల్లాల్లో ఒక్కటీ ప్రారంభం కాలేదు. కానీ, ఆయా జిల్లాల్లో ఇప్పటికే దాదాపు 2,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కేంద్రాల వద్దకు వచ్చి ఉన్నట్టు అధికారులే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కోతలు వేగవంతం కావడంతో వారంలో మరో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది. కానీ, నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాక అన్నదాతలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ప్రైవేట్ వ్యాపారులకు తెగనమ్ముకుంటున్న రైతులు
నిబంధనల ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,389 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీటిని ఐకేపీ, లేదా ప్రాథమిక సహకార సంఘాలు, మెప్మా కేంద్రాల్లో విక్రయించినట్టు నమోదైతే సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున సర్కారు బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా ఏ గ్రేడ్ ధాన్యం ఒక క్వింటాలుకు రైతుకు బోనస్‌తో కలిపి రూ.2,889 చెందాల్సి ఉంటుంది. కానీ, కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాక, ఎన్నిరోజులు పడిగావులు పడాల్సి వస్తుందోనన్న ఆందోళన, వర్షాలొస్తాయన్న వాతావారణ శాఖ హెచ్చరికలతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు వ్యాపారులు.. ఆయా ప్రాంతాలను బట్టి క్వింటాకు రూ.1,750 నుంచి 1,900 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో రైతు భారీగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఇంత జరుగుతున్నా కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర, బోనస్ ఇస్తామన్న ధీమాను కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు.
జాడలేని మంత్రులు, అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా రైతుల అవస్థలు, కొనుగోళ్ల అంశంపై ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు కనీసం సమీక్షలే జరపలేదని తెలుస్తున్నది. అధికారులు కూడా కనీసం పట్టించుకోవడం లేదని రైతులే గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్లో అమ్మకానికి ధాన్యం తెచ్చిన రైతులను పట్టించుకునే నాథుడే లేదని ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని మార్కెట్ కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చి ఉంచిన ధాన్యం ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. యాదాద్రి జిల్లాలో వరదకు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులకు మద్దతుతోపాటు బోనస్ దక్కేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది.
గంగాధర మార్కెట్లో 20 రోజలుగా పడిగాపులు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన కటం లచ్చయ్య 20 రోజుల క్రితం గంగాధర మార్కెట్ యార్డు లో అమ్మకానికి వడ్లు తెచ్చా డు. కొనుగోలు కేంద్రం ఎవరి కీ అలాట్ చేయకపోవడంతో అక్కడే పడిగాపులు గాస్తున్నాడు. వడ్లను ఆరబోయగా, నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చింది. నాలుగు రోజుల క్రితం వర్షం కురవడంతో తేమశాతం పెరిగింది. మళ్లీ వాటిని నిత్యం ఆరబోస్తూ అవస్థలు పడుతున్నాడు. ఇది కేవలం కటం లచ్చయ్య రైతు వ్యథ మాత్రమే కాదు. ఇప్పటికే ఈ యార్డుకు దాదాపు 70 మందికి పైగా రైతులు ధాన్యం తెచ్చి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయినా ఇక్కడ సెంటర్‌ను ఐకేపీకి ఇస్తారా? లేక పీఏసీఎస్‌కు కేటాయిస్తారో నేటివరకు నిర్ధారించలేదు.
ధాన్యం తెస్తే కొంటలేరు!
మాది రుక్మాపూర్ గ్రామం. మూడెకరాల్లో వరి వేసిన. మా ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజుల క్రితం అమ్మకానికి వరి ధాన్యం తెచ్చినం. ఇక్కడ కూడా ధాన్యం కొంటలేరు. మబ్బులు చూస్తే భయం అవుతున్నది. ఇక్కడి అధికారులను అడిగితే ఇంకో రెండు రోజుల్లో ప్రారంభించి కొంటామని అంటున్నారు. కొనుగోలు కేంద్రం త్వరగా ప్రారంభించి మాకు మద్దతు ధర ఇవ్వాలి.
– బండారి స్వప్న, మహిళా రైతు (రుక్మాపూర్)