Supreme Court : ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా పెళ్లికిముందే శారీరక సంబంధం పెట్టుకుంటే వారి ప్రవర్తన లేదా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో సాగిన ఇలాంటి సంబంధాలను చట్టం ఏమాత్రం నిషేధించలేదని స్పష్టంచేసింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి (Gajula |Thirupati) అనే వ్యక్తి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే పెళ్లికి ముందు ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడనే కారణంతో తెలంగాణ ప్రభుత్వం అతని ఉద్యోగాన్ని రద్దుచేసింది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ 2014లో తిరుపతిపై ఓ యువతి క్రిమినల్ కేసు పెట్టింది. ఆ తర్వాత 2015లో లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు రాజీకొచ్చాయి. ఈ పాత కేసును కారణం చూపిస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతని ఉద్యోగాన్ని రద్దుచేసింది. దీనిపై సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. పోలీసు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో పెళ్లికి ముందే ప్రేమించుకోవడం, శారీరక సంబంధాలు కలిగి ఉండటం సాధారణంగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నంత మాత్రాన వారు పెళ్లి చేసుకోలేదనే ఒకే ఒక్క కారణంతో ఒకరు మరొకరిని మోసం చేశారని అనుకోలేమని స్పష్టంచేసింది. ప్రతి ప్రేమకథా పెళ్లితోనే ముగియాలని నియమం ఏమీలేదని ధర్మాసనం పేర్కొన్నది. లోక్ అదాలత్‌లో కేసు రాజీపడినంత మాత్రాన అభ్యర్థి తన తప్పును ఒప్పుకున్నట్లు కాదని న్యాయమూర్తులు స్పష్టంచేశారు. బాధితురాలే స్వయంగా కేసును వెనక్కి తీసుకుని రాజీపడినప్పుడు.. సదరు అభ్యర్థి క్యారెక్టర్ బాలేదంటూ ఉద్యోగానికి అనర్హుడిని చేయడానికి పోలీస్బోర్డుకు ఎలాంటి హక్కు లేదని తేల్చిచెప్పింది. కేవలం విఫలమైన ప్రేమబంధాన్ని సాకుగా చూపి ఉద్యోగం నిరాకరించడం పూర్తిగా అన్యాయమని కోర్టు పేర్కొన్నది.
చివరికి సుప్రీంకోర్టు తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన రద్దు ఉత్తర్వులను పూర్తిగా కొట్టివేసింది. సదరు అభ్యర్థిని వెంటనే విధుల్లోకి తీసుకుని, తదుపరి బ్యాచ్ కానిస్టేబుళ్లతోపాటు శిక్షణకు పంపాలని ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.