జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామ నల్ల చెరువు కింద దాదాపు 20 ఎకరాలు, గారెపల్లి చింతల చెరువు కింద సుమారు 30 ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతులు పంటను జీవాలకు వదిలేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతారంలో లోవోల్టేజీ కారణంతో ట్రాన్స్ఫార్మర్ బుడ్డీలు కాలిపోయాయి. చేవెళ్లకు తీసుకెళ్లి మరమ్మతు చేయించుకొని వచ్చారు. ఒక్కరోజు వ్యవధిలోనే మళ్లీ కాలిపోవడంతో ట్రాన్స్ఫార్మర్ బుడ్డీని చేవెళ్లకు తరలించారు. దీంతో తమపై ఖర్చుల భారం పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా రూరల్ మండలం కస్నాతండాకు చెందిన రైతు భూక్యా నాగేశ్వరరావు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని గురువారం అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. మెడలో మిర్చి దండ, చేతిలో ప్లకార్డుతో తన మిర్చి కల్లంలో గంటపాటు నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిట్టుబాటు ధరతోపాటు అర్హులైన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశాడు.