చిల్పూరు, అక్టోబర్ 21 : ధాన్యం కొనరు.. బయట అమ్ముకోనియ్యరంటూ ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజులుగా ధాన్యం ఎగుమతి చేయకపోవడంతో మంగళవారం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. స్థానిక క్రీడా ప్రాంగణంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఈ నెల 17న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సెంటర్లో 20 మంది రైతులు ధాన్యం కుప్పలు పోయగా మంగళవారం వరకు ఒక్క లారీ లోడ్ కూడా ఎగుమతి చేయలేదు. దీంతో వర్షం పడి ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తింది. బయటనైనా అమ్ముకుందామని ధాన్యాన్ని తరలించే ప్రయత్నం చేస్తే పోలీసులు, అధికారులు, సెంటర్ నిర్వాహకులు అడ్డుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
నేను 10 ఎకరా ల్లో వరి సాగు చేసిన. ఆరుగాలం కష్టం చేసి ధాన్యాన్ని ఐకేపీ సెం టర్కు తీసుకొచ్చిన. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసింది. సెంటర్కు తీసుకురాగానే నిర్వాహకులు ధాన్యంను ఎగుమతి చేయకపోవడంతో తడిసి మొలకెత్తింది.
– ఆవుల లింగయ్య, రైతు, చిల్పూరు
నేను ఆరెకరాల్లో వరి సాగు చేసిన. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్ముదామని వచ్చిన. కేంద్రం ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా ఒక్క లారీ కూడా ఎగుమతి కాలేదు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోయింది.
– బోడ సంపత్, రైతు, చిల్పూరు