చిన్నశంకరంపేట/కల్వకుర్తి, ఫిబ్రవరి 3 : ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారు. వానకాలంలో వెంటాడిన యూరియా కష్టాలు యాసంగిలోనూ వీడటంలేదు. ఓవైపు యూరియా స్టాక్ ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం నిల్వలు కనిపించడంలేదు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా నాగర్కర్నూల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. పారదర్శకంగా యాప్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు నీటిమీద మూటలుగానే మిగిలాయి. జిల్లాలో యూరి యా నిల్వలు నిల్ అంటూ తాటికాయంత సైజ్లో యాప్లో అక్షరాలు దర్శనమిస్తున్నాయి.
ఫర్టిలైజర్ యాప్లో యూరియా బస్తాలు క్షణాల్లో అయిపోతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో యాసంగిలో పెద్ద ఎత్తున వరి, మొక్కజొన్న పంటలు సాగుచేశారు. ఈ పంటలకు యూరియా పెద్ద మొత్తంలో అవసరం ఉన్న నేపథ్యంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయాధికారులు పంటల సాగు ప్రణాళిక పూర్తిస్థాయిలో తయారు చేయకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తా వద్ద మెదక్-చేగుంట రహదారిపై మంగళవారం యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
చిన్నశంకరంపేట రైతువేదిక వద్దకు ఉదయమే వివిధ గ్రామాల నుంచి 400 మంది రైతులు యూరియా కోసం తరలిరాగా అధికారులు యాప్లో యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు. చాలామంది రైతులకు చిన్న(ఫీచర్)ఫోన్లు ఉండడం, స్మార్టు ఫోన్లు ఉన్నవారు సైతం యూరియా కోసం ఎంత ప్రయత్నించి నా బుక్ కాకపోవడంతో ఆగ్రహంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏవో లక్ష్మీప్రవీణ్, ఎస్సై నారాయణ రైతుల వద్దకు చేరుకొని రైతు వేదిక వద్ద క్యూలో నిలబెట్టి టోకెన్లు ఇచ్చారు. యాప్ ద్వారా యూరియా పంపిణీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.