యాచారం/నర్సంపేట/పెద్దకొత్తపల్లి, జనవరి 5: యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. లోడ్ వచ్చిందన్న సమాచారం రాగానే రైతులు సొసైటీలు, గోదాముల వద్దకు తెల్లవారుజామునే పరుగులు తీస్తున్నారు. చలిలోనే గంటల కొద్దీ క్యూకడుతున్నారు. అయినప్పటికీ సగం మందికి కూడా బస్తాలు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా సర్కార్ తీరు మారడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారంలోని పీఏసీఎస్ గోదాము వద్దకు పరుగులు తీశారు. 24 గ్రామ పంచాయతీలకు 450 బస్తాలు మాత్రమే రావడంతో చాలామంది రైతులకు యూరియా దొరకలేదు. కొందరు ఆదివారం అర్ధరాత్రి నుంచే పంపిణీ కేంద్రాలకు తరలివెళ్లారు. వరంగల్ జిల్లా ముత్యాలమ్మతండా, గురిజాల, గుంటూర్పల్లి, చిన్న గురిజాల, జీజీఆర్పల్లిలో రైతులు యూరియా కోసం ఆయా జీపీలకు సోమవారం తెల్లవారుజామున 3 గంటలకే చేరుకొని క్యూకట్టారు.
వ్యవసాయ, సొసైటీ అధికారులు, సిబ్బంది తొలుత రైతులకు టోకెన్లు అందించారు. ముత్యాలమ్మ తండాలో యూరియా టోకెన్ల కోసం రైతులు పట్టాపాస్‌బుక్‌లను లైన్లో పెట్టారు. గురిజాలలో జీపీ ఎదుట టోకెన్ల కోసం భారీగా గుమిగూడారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు క్యూకట్టారు. మహిళలు, వృద్ధులు సైతం తెల్లవారుజాము నుంచి క్యూలో వేచి ఉన్నా యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు మండిపడుతున్నారు. స్వయంగా కలెక్టర్ వచ్చి సింగిల్ విండో కార్యాలయాన్ని, యూరియా స్టాక్ పాయింట్‌ను పరిశీలించి వెళ్లినా యూరియా పంపిణీలో ఎలాంటి మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.