హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాగుడుమూతలు ఆడుతున్నారనే అసంతృప్తి రైతుల్లో వ్యక్తమవుతున్నది. రైతుబంధు పంపిణీ పూర్తికి ఎడాపెడా తేదీలు మార్చేస్తూ బిచ్ఛం వేస్తున్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నుంచి రైతుబంధు వేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో నమ్మించి, తీరా మార్చి నాటికి కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు కూడా రైతుబంధు పంపిణీ పూర్తికాకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యాన్ని ఎండగడుతున్నది. రైతుబంధు పంపిణీ ఎప్పటికీ పూర్తి చేస్తారన్న విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికే స్పష్టత ఉన్నట్టు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు తేదీలు మార్చేస్తున్నారు.
ఈ నెలలోనే రెండుసార్లు మాట మార్చడం గమనార్హం. ఈ నెల 2న ఎల్బీస్టేడియంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నాటికి అందరికీ రైతుబంధు పంపిణీ చేస్తామని ప్రకటించారు. గడువు సమీపిస్తున్నా పూర్తికాకపోవడంతో మళ్లీ మాట మార్చారు. ఈ నెల 21న కొడంగల్ పర్యటన సందర్భంగా కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మార్చి 15 నాటికి అందరి ఖాతాల్లో రైతుబంధు జమ అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఆ మాట మీద కూడా నిలబడలేదు. సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మార్చి 31 నాటికి రైతుబంధు వేస్తామంటూ కొత్త డేట్ ప్రకటించారు. దీంతో కొత్త తేదీపై కూడా తమకు నమ్మకం లేదని రైతులు వ్యాఖ్యానిస్తుండటం ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న విశ్వసనీయతను సూచిస్తున్నది.