తొర్రూరు : కాంగ్రెస్(Congress) పాలనలో రైతుల కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. జిల్లాలో పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చేపట్టిన రైతులు నేడు సాగు, తాగు నీరు లేక కండ్లముందే పంటలు ఎండిపోతుంటే కన్నీరుమున్నీరవుతున్నారు. రైతన్న కష్టాన్ని పట్టించుకునే వారు లేక అల్లాడిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కార్కల గ్రామ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బయ్యన్న వాగు నుంచి నిరంతరం నీళ్లు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పంటకు ఎలాంటి నీటి కొరత ఉండేది కాదు. కానీ, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పంటలు ఎండిపోతున్నా కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట విపత్తు..
కొత్త ప్రభుత్వం వచ్చాక బయన్న వాగులో నీరు లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ నేతలు ఒక్కసారి కూడా ఈ సమస్యపై స్పందించలేదు. వేల ఎకరాల పంట ఎండిపోతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నది. ‘‘గత ప్రభుత్వంలో సాగునీరుకు మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పట్ల అనాగరిక వైఖరిని ప్రదర్శిస్తోంది. వాళ్లకు మేం ఓట్లు వేసామే గానీ, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు,” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎందుకు మౌనం.?
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించలేదలని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం రాజకీయ లాభాల గురించే ఆలోచన చేస్తుందే తప్పా పేద రైతుల కష్టాలు, వారి భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టడం లేదని రైతులు వాపోతున్నారు. రాత్రి, పగలు కష్టపడి పెట్టుబడి సాయం అందకున్నా అప్పు చేసి సాగు చేస్తే నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే నీటిని విడుదల చేయాలి
కార్కల రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వెంటనే బయన్న వాగు నుంచి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన హమీలు నెరవేరుస్తూ పంటలకు నీరందించాలంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందా? లేక మళ్లీ రాజకీయ లబ్ధి కోసమే పని చేస్తుందో తేల్చుకోవాలన్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఎండిపోతున్న పంటలు..
వయసు మీద పడుతున్నా పొలం పనుల్ని విడిచిపెట్టలేదు. జీవితాంతం వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న. ఈసారి ఎంతో ఆశపడి 5 ఎకరాల పొలంలో పంట వేశాను. విత్తనాలు కొనడానికి అప్పు చేశాను. ఎరువులు, పురుగుమందులు, దైనందిన ఖర్చులతో అప్పు మరింత ఎక్కువైంది. కానీ ఇప్పుడు పొలంకు నిరు అందక ఎండిపోతుంది. కనీసం నష్టాన్ని కూడా తిరిగి పొందే అవకాశం కనిపించడం లేదు.”గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. బయన్న వాగులో నీరు ఎప్పడికి నిలిచి ఉండేది. పొలాల్లో తడిగా ఉండేది. కానీ ఇప్పుడు మా పంట ఎండిపోతోంది. చేతులారా వేసిన వాటిని చేతులారా తీయాల్సిన పరిస్థితి వచ్చింది.”ఒక వర్షం పడితే అయినా పంట నిలబడేది. లేదంటే ప్రభుత్వం సహాయం చేసి నీళ్లు ఇస్తే అయినా పండేది. కానీ ఇవి రెండూ జరగలేదు. మేము ఓట్లు వేసిన వాళ్లు ఇప్పుడు కనబడడం లేరు.
–సేగ్యం లచ్చయ్య, కర్కల గ్రామ రైతు
పురుగుల మందు తాగల్సిన పరిస్థితి..
సర్వే నెంబర్ 81 వద్ద 6 ఎకరాల భూమిలో పంట వేశాను. ఈ పంట కోసం మొత్తం రూ.1,00,000 నా భార్య బంగారం తాకట్టు పెట్టి, అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టాను. కానీ ప్రస్తుతం నీటి కొరత వల్ల నా పంట ఎండిపోతుంది. అంతేకాక, కాంగ్రెస్ ప్రభుత్వంలో బోనస్ కూడా నాకు అందలేదు. ప్రస్తుతం నా పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే యశ్వసిని రెడ్డి స్పందించి బయ్యాన్న వాగులో నీటిని విడుదల చేయాలి. లేదంటే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చివరకు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే వెంటనే ఈ సమస్యపై స్పందించి రైతులను కాపాడాలి.
-కడుదుల మల్లయ్య, కర్కాల గ్రామ రైతు