Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తేనైనా రుణమాఫీ అవుతుందేమోనన్న ఆశతో రైతులంతా గ్రీవెన్స్ సెల్‌కు పరుగులు తీస్తున్నా.. నిరాశే మిగులుతున్నది. రుణమాఫీపై రైతులు చేస్తున్న ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవటం లేదు. రైతులు గొడవ చేయకుండా, వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కంటితుడుపు చర్యగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తీసుకున్న ఫిర్యాదులను ఉన్నతాధికారులకు పంపించకపోవటంతో ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి కాదని, రైతులను మభ్యపెట్టడానికేనని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
రెండు విడతల్లో రూ.1.5 లక్షల వరకు రుణం కలిగిన 17.75 లక్షల మంది రైతులకు రూ.12,224 కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మాఫీ లెక్కలు పేపర్‌పైనే ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రైతులంతా ఏఈవోలు, బ్యాంకులకు క్యూ కడుతున్నారు. తమకెందుకు రుణమాఫీ కాలేదని ఆరా తీస్తున్నారు. అధికారులు చెప్పే ఏవేవో కారణాలతో నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. ఆధార్‌కార్డులో, పాస్‌బుక్‌లో పేర్లు వేరుగా ఉన్నాయని, రేషన్‌కార్డు లేదని, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, పాస్‌బుక్ లేదని.. ఇలా ఏఈవోలు అనేక కారణాలు చెప్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. అక్కడ వాళ్ల గోడువినే నాథుడే లేకుండా పోయాడు. రుణమాఫీ జాబితాలో పేరుంటేనే తమ వద్దకు రావాలి.. లేదంటే తమకేం సంబంధం లేదంటూ బ్యాంకు అధికారులు తేల్చి చెప్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫిర్యాదు కేంద్రాలకు, ఏఈవోల వద్దకు, బ్యాంకులకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. సాంకేతిక కారణాలు, ఇతర సమస్యల వల్ల తొలి విడతలో 17 వేల మందికి, రెండో విడతలో 30 వేల మందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెల్లడించారు. అంటే రెండు విడతల్లో కలిపి సుమారు 47 వేల మందికి రుణమాఫీ కాలేదు. ఇందులో 7 వేల మంది సమస్యలను మాత్రమే పరిష్కరించినట్టు మంత్రి తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అధికారులు చేసిన తప్పులు, సాంకేతిక తప్పిదాలతో 30 వేలమందికి రుణమాఫీ కాలేదని టెస్కాబ్ బ్యాంకు అధికారులే వెల్లడించారు. 3,982 మంది రైతుల పేర్లు జాబితాలో చేర్చలేదని తెలిపారు.
రుణమాఫీ కాని వారి కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నది. ఈ నంబర్‌కు ఇప్పటికే 45 వేలకు పైగా ఫిర్యాదులు అందినట్టు ఆ పార్టీ తెలిపింది. జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. ‘నమస్తే తెలంగాణ’ సేకరించిన వివరాల ప్రకారం ఫిర్యాదు కేంద్రాల్లో సుమారు 26 వేల వరకు ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా ఖమ్మంలో 7,400, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6 వేలు, మహబూబ్‌నగర్‌లో 1,300, జోగులాంబ గద్వాలలో 950, యాదాద్రి భువనగిరిలో 617, సూర్యాపేటలో 2,500, భూపాలపల్లిలో 1,721, ములుగులో 1,050, హనుమకొండలో 619, మహబూబాబాద్‌లో 262, రంగారెడ్డిలో 1,332, వికారాబాద్‌లో 2,218, నిర్మల్‌లో 1,290, వరంగల్‌లో 224 ఫిర్యాదులు అందాయి. ఇవి కేవలం రైతులు ఆఫీసుకు వచ్చి చేసిన ఫిర్యాదులే. ఏఈవోల వద్ద ఫిర్యాదులు ఇంతకు రెట్టింపు ఉంటాయని తెలిసింది. అయితే, ఈ ఫిర్యాదులు ఎంతవరకు పరిష్కారానికి నోచుకుంటున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్రస్థాయిలో తీసుకున్న ఫిర్యాదులు ఉన్నతాధికారులకు పంపించటం లేదని తెలిసింది. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌లో ఎలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయకపోవటం గమనార్హం. అసలు రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీపై ఎన్ని ఫిర్యాదులు అందాయనే లెక్కాపత్రం ఉన్నతాధికారుల వద్ద లేనేలేదు. అంటే.. కంటితుడుపు చర్యగానే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఖానాపూర్, ఆగస్టు 8 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతోపాటు, పట్టణానికి చెందిన పలువురు మహిళలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను నిలదీశారు. గురువారం పట్టణంలో వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు భూమిపూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను వారు పలు సమస్యలపై ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో నెలకొన్న సమస్యలను, పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇండ్లల్లో కొందరు ఉండటం లేదని, వారి స్థానంలో అర్హులైన వారికి ఇవ్వాలని స్థానిక నిరుపేదలు కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నదని, దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. మహిళలు వినకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.