(నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్) ; రాష్ట్ర ప్రభుత్వం వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టడంపై రైతుల పక్షాన గులాబీదళం గళం విప్పింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రెండోరోజూ సోమవారం నిరసనలు జోరుగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఇవ్వాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో రైతులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు, రైతులు కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేసేందుకు పోలీసులను తప్పించుకుంటూ సంఘాల నాయకులు కార్యాలయంలోకి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్ రాజర్షా షా ప్రజావాణి కార్యక్రమం నుంచి బయటకువచ్చి తుడుందెబ్బ నాయకులు, రైతులతో మాట్లాడారు. వినతిపత్రం ఇవ్వడానికి వస్తున్న పోలీసుల తమపై, మహిళా నాయకురాళ్లపై దురుస్తుగా ప్రవర్తించారని, వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, తమను దుర్బాషలాడిన పోలీసులు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నస్రుల్లాబాద్, చందూర్, జుక్కల్ తదితర మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
వనపర్తి జిల్లాలోని జంగమాయిపల్లిలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి, నర్సింహులపేట మండల కేంద్రాల్లో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కురవిలో మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేయగా, అశ్వాపురంలో నిరసన ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో రాస్తారోకో చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బిట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రేణులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. అరగంట పాటు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టడంతో రవాణా స్తంభించింది.ఎస్ఐ కొమురయ్య అక్కడికి చేరుకొని రాస్తారోకోను అడ్డుకున్నారు. సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని బస్టాండ్‌లోగల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ మండల కన్వీనర్ అస్లాంబిన్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు ధర్నా నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు.