Siddipet | నారాయణరావుపేట, సిద్దిపేట, మార్చి 8: ‘ఈ పంట నడువంగనే ఇప్పటికే రెండు, మూడు సార్లు మోటర్లు కాలినయ్. దాన్ని రిపేర్‌కు తీసుకచ్చుడు, తీస్కపోవుడు, రిపేర్‌కు కలిసి రూ.15 వేల దాకా ఖర్చు అయితున్నది. తాపతాపకు కరెంటు పోతున్నది. ట్రిప్పుల కరెంటుతో తిప్పలయితున్నది. సాయంత్రం 5 గంటలకు పోయి, రాత్రి 11 గంటలకు వస్తున్నది. నీళ్లకు కూడా గోస అయితున్నది. పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నయ్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నీళ్లకు, కరెంటుకు టెన్షనే లేకుండే. ఇప్పుడు రైతుబంధు కూడా వస్తలే. కాంగ్రెస్ వచ్చినంక రూ.15 వేలు వేస్తామన్నది. ఉన్నదే దిక్కులేదు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బుగ్గ రాజేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకొని వస్తున్న క్రమంలో నారాయణరావుపేటలోని మోటర్ వైండింగ్ షాపులో పలువురు రైతులు ఉండటాన్ని గమనించిన ఆయన.. వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు లు కాంగ్రెస్ పాలనలో మోటార్లు కాలిపోతున్నాయని, లోఓల్టేజీ సమస్యతో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. ఒకవైపు రైతుబంధు అందలేదని, మరోవైపు మోటర్ల రిపేర్ కోసం ఉన్న పైసలన్నీ ఖర్చు అయితున్నదని వెల్లడించారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తమ కష్టాలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాలిపోయిన మోటర్ల రిపేర్ కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిందని ఆ మోటర్ వైండింగ్ షాపు యజమాని హరీశ్‌రావుతో తెలిపారు.
కేసీఆర్‌పై కక్ష.. రైతులకు శిక్ష
బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై కక్షతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత చర్యలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. గత ఎండాకాలంలో ఈ సమయానికి కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయించి చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లను నింపి మండుటెండల్లో సైతం మత్తళ్లు దుంకించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచా రం చేస్తూ నీళ్లను విడుదల చేయడం లేదని విమర్శించారు. నీళ్లు అందక రైతులు కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కరెంట్ కష్టాలతో మోటర్లు కాలిపోతున్నాయని, ఎక్కడ చూసినా పంటలు ఎండుతున్న దృశ్యాలు, కాలిపోయిన మోటర్లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై ప్రజలు రోడ్డెక్కుతున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు ఇలా ఇబ్బంది పడలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాలు మాని పాలనపై దృష్టిసారించాలని హితవు పలికారు.
రైతులతో హరీశ్‌రావు సంభాషణ ఇలా..
హరీశ్‌రావు : నీ పేరేంటి?
రైతు: గొడుగు శంకర్
హరీశ్‌రావు: నువ్వెందుకున్నవ్?
రైతు: మోటర్ కాలిపోయింది
హరీశ్‌రావు: మోటర్ కాలిపోయిందా, చేయించినవా, ఎన్ని రోజులయ్యింది?
రైతు: వారం కింద కాలింది. చేయించిన
హరీశ్‌రావు: పంట మీద ఎన్నిసార్లు కాలింది?
రైతు: ఈ పంట మీదనే రెండు సార్లు కాలింది (మరో రైతు సత్తయ్యతో..)
హరీశ్‌రావు: నీదెప్పుడు కాలింది మోటర్?
రైతు: నిన్నొకటి కాలింది. ఇయ్యాల ఒకటి కాలింది. 6 ఎకరాలు పంట సాగుచేశా, మూడున్నర ఎకరాలు ఎండిపోయింది.
హరీశ్‌రావు: మోటర్ కాలితే రిపేర్‌కు ఎంత ఖర్చయితది?
రైతు: అన్ని కలిపి రూ.10 వేల దాకా అయితయి సారు
హరీశ్‌రావు: అంటే మోటర్ కాలిపోయి రిపేర్ చేసుడు, తీసుడు, దించుడు అయ్యేసరికి ఎనకవడి పంట ఎండిపోతుందన్న మాట.
రైతులు: అవును సారు
బాలరాజు: సారు నా మోటరు కూడా కాలిపోయింది
హరీశ్‌రావు: నీ మోటర్ ఎందుకు కాలింది?
బాలరాజు: కరెంటు, నీళ్లు లేక కాలిపోతుంది సారు
హరీశ్‌రావు: లో ఓల్టేజీ వస్తుందా?
రైతులు: అవును సారు సరిపోయేట్టు వస్తలేదు. ఒకసారి తక్కువ వస్తుంది. సాయం త్రం 5.30కు పోతే రాత్రి 11 గంటలకు కరెంటు వస్తది
హరీశ్‌రావు: పొద్దుందాక ఎప్పుడు వస్తుంది?
రైతులు: టైం ఏమీ లేదు సారు. ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో!
హరీశ్‌రావు: రోజుకు ఎన్నిగంటలొస్తుంది?
రైతులు: 14, 15 గంటలు వస్తుంది. కానీ లో వోల్టేజీ ఉంటది సారు
హరీశ్‌రావు: రిపేర్లు ఎన్ని అయితున్నయి?
రైతులు: రోజుకు నాలుగుదు రిపేరు అయితున్నయి సారు.
హరీశ్‌రావు: పోయిన సంవత్సరం కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఇట్ల మోటర్లు కాలుతుండేనా?
రైతులు: యే కాలలేదు సారు. ఏ టెన్షన్ లేకుండే. ఇప్పుడు లో వోల్టేజీ వచ్చి కాలిపోతున్నాయి. నీళ్లు కూడా తగ్గిపోయి మోటర్లల్ల బురద ఇరికి కాలిపోతున్నాయి.
హరీశ్‌రావు: కేసీఆర్ సారు ఉన్నప్పుడు నీళ్లకు టెన్షన్ లేదు, కరెంటుకు టెన్షన్ లేకుండే కదా. కేసీఆర్ సారు లేకుండేసరికి ఒకటొకటి ఇబ్బంది అయితున్నది.
రైతులు: అవును సారు. మాకు అప్పుడు ఏ టెన్షన్ లేకుండే. ఇప్పుడేమో రైతుబంధు కూడా వస్తలేదు.
హరీశ్‌రావు: రైతుబంధు అటేవాయే, బోనస్ అటేపాయే. రూ.15 వేలు ఇస్తమన్నరు. రూ.10వేలకే దిక్కు లేకపాయే.
రైతులు: నీళ్లులేకనే ఎక్కువ గోస అయితుంది సారు
రాజకీయ ప్రేరేపితుల కుట్రలు నమ్మొద్దు
రాజకీయ ప్రేరేపితుల కుట్రలు నమ్మొద్దని ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వటాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు కొందరు రాజకీయ ప్రేరేపితులు తనపై దుష్ప్రచారం చేయటం బాధాకరమని అన్నారు. ఉద్యమకాలం నుంచి తమకు ఉద్యోగులతో ఉన్నది పేగుబంధమని, దాన్ని కొన్ని దుష్టశక్తులు వేరుచేయాలని చూస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా ప్రచురించిన సదరు మీడి యా సంస్థకు రిజాయిండర్ పంపించి, వార్తను సరిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొం దరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని, ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలన్న హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీశానని తెలిపారు. ‘అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తాను. ఎల్లప్పుడూ వారిహకుల కోసం అండగా నిలిచే నాపై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఉద్యోగులకు నాలుగు కరువు భత్యాలు విడుదల చేయాలి. ఎంప్లాయ్హెల్త్ సీమ్ అమలు చేయాలి. పీఆర్సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తక్షణం స్పందించాలి’ అని డిమాండ్ చేశారు.