నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు కష్టాలు తప్పడంలేదు. ప్రకృతి కరుణించక, ప్రభుత్వాలు కనికరించక అడుగడుగునా దగా పడాల్సిన వస్తున్నది. పెరిగిన పెట్టుబడుల భారం, వైపరీత్యాలను దాటుకుని పంట చేతికి వచ్చినా మార్కెట్లో సరైన ధర లభించకపోవడం తీరని దుఃఖంగా మారిపోతున్నది. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని మండిపడుతున్నారు. గత వానాకాలంలోనే ఎరువుల ధరలు భారీగా పెరగగా ఇప్పుడు యాసంగిలోనూ మరోసారి పెరిగాయి. ఎరువుల రకాన్ని బట్టి ఒక్కో రకంపై రూ.50-రూ.100 వరకు పెరిగాయి. పెరిగిన ఎరువుల ధరలు రైతులకు ఆర్థికంగా మరింత భారం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర రైతులపై వందలాది కోట్ల రూపాయల భారం పడుతున్నది. ఉదాహరణకు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చూస్తే యాసంగిలోనే రైతులపై రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. పత్తి కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులకు దిక్కుతోచడంలేదు. ఎరువుల ధరలతోనూ మరింత భారం మోపడం దారుణమని అన్నదాతలు వాపోతున్నారు.
ఏడాదిలో రెండుసార్లు పెంచితే ఎలా?
గత ఖరీఫ్‌లోనే ఎరువుల ధరలను పెంచుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇప్పుడు యాసంగిలో మళ్లీ ధరలు పెంచారు. ఒక్కో ఎరువుపై ఏడాదిలోనే 15 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగాయంటే భారం ఏ మేరకు పడుతుందో అర్థం చేసుకోవచ్చని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ఒక్కో రైతుపై సగటున ఒక పంటకు ఏడాదికి రూ.2000-రూ.3000 వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. గత యాసంగి ధరలతో పోలిస్తే ప్రస్తుతం ఒక్కో కాంప్లెక్స్ ఎరువు బస్తాపై రూ.150 నుంచి రూ.430 వరకు ధర పెరిగింది. ఏడాదిలోనే రెండుసార్లు ఎరువుల ధరలు పెంచితే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మూడేండ్లుగా ధరలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. కేంద్రం ఎరువుల ధరల తగ్గించేలా బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.