అమరచింత, సెప్టెంబర్ 24 : మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. రుణమాఫీపై రైతులు, ఆరు గ్యారెంటీల అమలుపై మహిళలు, ఇతరులు నిలదీశారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్‌కడ్మూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సబ్సిడీ సిలిండర్ల ధ్రువపత్రాలను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామని చెప్పారు. దీంతో గ్రామస్థుడు తన ఇంటికి ఉచిత విద్యుత్తు రావడం లేదని, తనతో బిల్లు కట్టించుకున్నారని చెప్పాడు.
అలాగే రుణమాఫీ అమలు కాలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇవ్వాలని, ఆసరా పింఛన్లు క్రమం తప్పకుండా పెంచి ఇవ్వాలని మహిళలు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని గ్రామంలోని 143 మంది రైతులకు రూ.4.17 కోట్లను మాఫీ చేశామని, కేవలం ముగ్గురికి రాకపోతే గొడవ చేయడం సరికాదన్నారు. ఒకే రేషన్‌కార్డుపై ఇద్దరు, ముగ్గురు రైతులు ఉన్నందున మాఫీ కాలేదని తెలిపారు.