Congress | కరీంనగర్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం మల్కపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలింది. అయితే, ఈ జలాలు మల్కపేట కాలువ మీదుగా బుగ్గరాజేశ్వర తండాకు చేరుకోగా, ఈ సందర్భంగా స్థానిక రైతులు మీడియాతో మాట్లాడారు. తమ వరి పంటలను కాపాడాలని ఎవరి చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి వద్దకు వెళ్తే.. ‘మాకేమన్న ఓటు వేసిన్రా? మీకు నీళ్లెందుకు ఇవ్వాలె? సత్తే సావుండ్రి’ అంటూ దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. 48 గంటల్లో నీళ్లివ్వకపోతే మంత్రి చాంబర్ ఎదుట బైఠాయిస్తానని కేటీఆర్ అల్టిమేటం జారీ చేయడంతోనే తమ ప్రాంత కాలువకు నీళ్లిచ్చారని రైతులు చెప్తున్నారు. నీటిని విడుదల చేయించిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు. కేటీఆర్ స్పందించకపోతే కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం పట్టించుకునేవాళ్లు కాదని వాపోయారు. ఆపసోపాలు పడుతూ నాలుగు రోజులకే నీళ్లు బంద్ పెట్టారని, కేటీఆర్ రంగంలోకి దిగి అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు సాయం చేశారని కొనియాడారు.
నీళ్లొస్తలేవు అంటే సావుండ్రి అంటున్నరు
మాకు నీళ్లు వస్తలేవు అంటే మీరు సావుండ్రి అని మాట్లాడిన్రు. ఇన్ని రోజులైనా నీళ్లు రాలేదు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లినా పని కాలేదు. కేటీఆర్ రాగానే నీళ్లు వచ్చినయ్, మా పొలాలు పారుతున్నయ్. కేటీఆర్ మంచిగా చేసిండు. రేవంత్ ఏం పని చేయలేదు. ఆ ఎమ్మెల్యే ఏం పని చేయలేదు. మహేందర్రెడ్డి కూడా ఏం చేయలేదు. నీళ్లు ఎందుకు ఇయ్యాలే? మాకేమన్నా ఓటు వేసినారా? అంటున్నరు.
-అజ్మీరా శశ్మల్నాయక్, రైతు, బుగ్గరాజేశ్వరతండా (ఎల్లారెడ్డిపేట)