రామకృష్ణాపూర్/దుబ్బాక, జనవరి 13: కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌కు మంగళవారం సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో నిరసన సెగ తగిలింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పట్టణంలో అభివృద్ధిపై స్థానికులు నిలదీయగా, రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా ఎక్కడ? అంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి పర్యటనను రైతులు అడ్డుకొన్నారు. వివరాలు ఇలా.. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని ఆయా వార్డుల ప్రజలు మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. 7వ వార్డుకు చెందిన ప్రజలు మంత్రిని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లయినా రోడ్డు ఎందుకు నిర్మించలేదని నిలదీశారు.
దీంతో అసహనానికి గురైన మంత్రి వివేక్ రోడ్డే కావాలంటే ప్రభుత్వాన్ని అడుక్కోడంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మంత్రి ప్రభుత్వంలో భాగమే కదా? మరి రోడ్డు వేయాలని ఏ ప్రభుత్వాన్ని అడగాలో తెలియక స్థానికులు ఒకింత ఆశ్చర్యపోయారు. అనంతరం మంత్రికి ఎదురు వచ్చిన 21వ వార్డుకు చెందిన మహిళ.. తమ వార్డులో సమావేశం ఉన్నదని, మంత్రి వస్తున్నారని స్థానిక నాయకులు ప్రకటించారని, తీరా సమావేశాన్ని రద్దు చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు మంత్రి స్పందిస్తూ 21వ వార్డులో మీటింగ్ తాను పెట్టమనలేదని అనడంతో.. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు చెప్పారని సదరు మహిళ సమాధానమివ్వగా, అసహనంతో ఉన్న మంత్రి అయితే పల్లె రాజునే అగడండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
దుబ్బాకలో మండిపడ్డ రైతులు
కాగా మంత్రి వివేక్.. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ధర్మాజీపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాగా రైతులు అడ్డుకున్నారు. అయ్యా మంత్రిగారు .. రూ.2 లక్షల రుణమాఫీ ఎటుపాయే? రైతుభరోసా ఎప్పుడిస్తరు? అంటూ ఫ్లెక్సీలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం చూపడంతో ఉద్రిక్తతకు దారితీసింది.