నాగర్‌కర్నూల్/పెంట్లవెల్లి, ఏప్రిల్ 7 : పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామి నగర్, ఎంగంపల్లి తండా, రామాపురం, సోమశిల గ్రామాలకు చెందిన 150 మంది రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని రుణమాఫీ చేయాలని నినదించారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. రుణాలను వెంటనే మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పెంట్లవెల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దార్ జయసింహకు వినతిపత్రం అందజేశారు.
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 7 : అందరికీ రుణమాఫీ చేయాలని, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, ప్రైవేటు అప్పుల నుంచి రైతులను రక్షించేందుకు అధికారులు సహకరించాలని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మారెడ్డి రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ మను చౌదరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులకు రుణాలు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఇప్పటికీ చాలామంది రైతులకు పంటరుణాలు మాఫీ కాలేదని, వందశాతం రుణమాఫీ చేయాలని కోరారు.