జయశంకర్ భూపాలపల్లి, జనవరి 7 (నమస్తే తెలంగాణ): చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య మళ్లీ మొదటికొచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రారంభించి 70 శాతం పనులను ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తిచేసింది. చెరువుల మరమ్మతు, మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ను నిర్మించాల్సి ఉండగా స్థల సేకరణ సమస్యగా మారింది. వారం రోజులుగా మెయిన్ కెనాల్ నిర్మాణం కోసం అధికారులు స్థల సేకరణ చేపడుతుండగా రైతులు అడ్డుకుంటున్నారు. తమకు పరిహారం ఇచ్చాకే సర్వే చేయాలని, పనులు ప్రారంభించాలని పట్టుబట్టారు. ఈ విషయమై తహసీల్దార్‌తోపాటు కలెక్టర్‌కు, మంత్రి శ్రీధర్‌బాబును కలిసి తమ గోడువెళ్లబోసుకున్నారు. అయినా ఫలితం లేకుండాపోయింది. మంగళవారం మళ్లీ అధికారులు మెయిన్ కెనాల్ పనులు ప్రారంభించేందుకు వెళ్లగా మహదేవపూర్‌లో రైతులు అడ్డుకున్నారు. రాళ్లబండి రజిత అనే మహిళా రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో రైతు ఆల్ల ప్రసాద్ ఇదేంటని ప్రశ్నించగా అతడిపై పోలీసులు తమ ప్రతాపం చూపించి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మహదేవపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిహారం ఇచ్చే వరకు భూములు ఇచ్చేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు.
20 మంది రైతుల సమస్య
చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు మెయిన్ కెనాల్ నిర్మాణంతో ఆరు గ్రామాలకు చెందిన 20 మంది రైతులు 10 ఎకరాలను కోల్పోతున్నారు. ఏళ్లతరబడి సాగు చేసుకుని బతుకుతున్నామని, తమకు పరిహారం ఇవ్వకుండా ఎలా లాక్కుంటారని రైతులు మండిపడుతున్నారు. అధికారులకు, మంత్రికి విన్నవించకున్నా ఫలితం లేదని, బలవంతంగా లాక్కుంటే చావే దిక్కని స్పష్టం చేస్తున్నారు. అధికారులు మాత్రం అది సర్కారు భూమి అని, పరిహారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తున్నారు.
చిన్న కాళేశ్వరంపై చిన్నచూపు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిన్న కాళేశ్వరం పనులను 3 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించి ఇప్పటికీ పైసా పనిచేయలేదని రైతులు మండి పడుతున్నారు. చెరువుల అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారగా కాలువల సర్వే పనులు సైతం ఇష్టారాజ్యంగా చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నారని రైతులు పనులను అడ్డుకుంటున్నారు. చిన్న కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. 14 చెరువులు నింపి 45,742 ఎకరాలకు సాగు నీరందించే ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసింది. పలు అనుమతుల్లో జాప్యం జరగడంతో మిగిలిన 30 శాతం పనులు పెండింగ్‌లో ఉండి పోయాయి.
మా భూములను గుంజుకుంటున్నరు
మా మామ పోచం పేరు మీద అరెకరం భూమి ఉన్నది. ప్రాజెక్ట్ కోసం అధికారులు అన్యాయంగా మా భూమి తీసుకుంటాళ్లు. ఇంతవరకు నష్టపరిహారం ఇయ్యలే. ఈ రందితోనే మామకు పక్షవాతం అచ్చింది. మంచం పైనుంచి లేత్తలేడు. న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు నా భర్త ప్రసాద్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేన్‌కు పట్టుకపోయిండ్రు. భూమినే నమ్ముకొని బతికేటోళ్లం. గింత దారుణంగా భూముల్ని లాక్కొంటే మేము ఎవరికి చెప్పుకోవాలే. నేను 9 నెలల గర్భిణిని. నా భర్తను అరెస్ట్ చేయద్దని పోలీసోళ్ల కాళ్లమీద పడ్డా ఇడిసిపెట్టలే.
– ఆళ్ల స్వాతి, ఎల్కేశ్వరం, మహదేవపూర్ మండలం, భూపాలపల్లి జిల్లా