బొంరాస్‌పేట, మార్చి 2 : ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ రైతులు శనివారం ఆందోళనకు దిగారు. స్వయాన సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలోనే సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు ఫార్మా విలేజ్‌ను ప్రతిపాదించింది. భూ సేకరణ కోసం అధికారులు ఇటీవల దుద్యాల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములను పరిశీలించారు.
ఫార్మా విలేజ్‌కు సాగు భూములిస్తే తామెలా బతకాలని ఆందోళనకు గురైన రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగుతున్నారు. శనివారం మూడు గ్రామాలకు చెందిన రైతులు దుద్యాల మండల కేంద్రంలోని చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ దానయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు.