విషపూరితమైన ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఫార్మా భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలెపల్లిలో తాండూర్ సబ్ కలెక్టర్, కడా ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో ఫార్మా కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఫార్మా కంపెనీ ఏర్పాటును 20 మంది రైతులు వ్యతిరేకిస్తూ తమ భూములు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి సీఎం అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించామని, కానీ ఈ విధంగా వినాశనానికి ఒడికడతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. – కొడంగల్
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్( బీసీ ఏవైఎఫ్)ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం ముట్టడికి యత్నించారు. దీంతో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు రూ.7,600 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.