వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చాయి. రుణమాఫీ కాక అప్పులతో పాటు మిత్తీలు పెరిగిపోయి మనస్తాపంతో ఆ రైతు పురుగుల మందుతాగి ప్రాణాలు వదలడంతో అతడి భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జగిత్యాల, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామానికి చెందిన పిట్టల లింగన్న (42) పదిహేనేండ్ల క్రితం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన తోకల నర్సయ్య కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నర్సయ్యకు కొడుకులు లేకపోవడంతో ఇల్లరికం తెచ్చుకున్నాడు. లింగన్న పదిహేనేండ్లుగా ఇబ్రహీంపట్నంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లింగన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. లింగన్న కొన్నేండ్ల క్రితం 34 గుంటల వ్యవసాయ భూమిని కొని సేద్యం చేస్తున్నాడు. అతడి భార్య లక్ష్మి పేరుపై రెండెకరాల భూమి ఉన్నది. ఆ రెండెకరాల భూమితోపాటు తన పేరుపై ఉన్న 34 గుంటల భూమి మొత్తంగా దాదాపు మూడెకరాల భూమిలో లింగన్న దంపతులు వ్యవసాయం చేస్తున్నారు. లింగన్న తన పేరిట ఉన్న 34 గుంటల భూమిపై రూ.80 వేల పంట రుణం, తన భార్య లక్ష్మి పేరిట ఉన్న రెండెకరాల భూమిపై రూ.1.50 లక్షల పంట రుణం తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని టీజీజీవీబీ రుణం పొందారు.
ఎన్నికల సమయంలో రెండు లక్షల పంట రుణం మాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రకటించడంతో లింగన్న, అతడి భార్య లక్ష్మి రుణం మాఫీ అవుతుందని ఆశించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆంక్షలతో తమకు రుణమాఫీ చేయకపోవడంతో ఆ దంపతులు హతాశులయ్యారు. భార్యాభర్తల పేరిట రుణం 2.30 లక్షలు ఉన్నదని, మీకు రుణమాఫీ కాలేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. పంట రుణం మాఫీ అయ్యే అవకాశం లేదని, కచ్చితంగా వడ్డీతో సహా అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు. పలుమార్లు వ్యవసాయశాఖ అధికారులను, బ్యాంకు అధికారులను కలిసి తనకు రుణమాఫీ చేయాలని కోరినా ప్రయోజనం లేకపోవడంతో లింగన్న దంపతులు తీవ్ర నిర్వేదానికి లోనయ్యారు. భూమి కొనుగోలు, పంట వేసేందుకు దాదాపు రూ.15 లక్షలు అప్పు చేసిన లింగన్న, కాంగ్రెస్ సర్కార్ చేస్తానన్న 2 లక్షల రుణం మాఫీ కాక తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. 15 లక్షల అప్పులు, వడ్డీతో కలిపి బ్యాంకులో తీసుకున్న రుణం, పిల్లల పెంపకం, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత అన్నింటిని తలుచుకొని వేదనకు గురై జనవరి 14న చేనులోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు మెట్పల్లి దవాఖానకు తరలించించారు. వారం మృత్యువుతో పోరాడిన లింగన్న జనవరి 20న మృతిచెందాడు. లింగన్న మృతితో ఆయన భార్య లక్ష్మి, 14ఏండ్ల కొడుకు హర్షవర్ధన్, 9 ఏండ్ల కూతురు నైనిక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
నేడు బీఆర్ఎస్ బృందం పర్యటన
ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్ కమిటీ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రైతు పిట్టల లింగన్న కుటుంబాన్ని పరామర్శించనున్నది. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు మంగవారం ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నం వస్తారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయని, రైతుభరోసా, కరెంట్, సకాలంలో ఎరువులు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేసిన మోసం నుంచి రైతులు కోలుకోవడం లేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఇంకా 40 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, దీంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలోనే రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, నివేదికను రూపొందించడంతోపాటు రైతు కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో లింగన్న కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో రైతులతో కమిటీ సభ్యులు సమావేశం కానున్నట్టు వివరించారు.