హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేండ్లపాటు కేసీఆర్ ప్రజా ప్రభుత్వం నడిపారని, మానవీయ పాలన కొనసాగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ఇందుకు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో ప్రకటించిన గణాంకాలే నిదర్శనమని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2022 వరకు రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో విడుదల చేసిన గణాంకాల చార్ట్‌ను అరవింద్ వారియర్ అనే నెటిజన్ పెట్టిన ట్వీట్‌కు కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
‘ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఉద్దేశపూర్వంగా గత పాలకులు నీటి వనరులను నిర్లక్ష్యంగా చేయడం మూలంగా తీవ్ర కరువుకాటకాలను అనుభవించింది. ఫలితంగా రైతులు పంటల సాగుకు అనేక ఇబ్బందులు పడ్డారు. సాగునీటి వనరులు లేక వ్యవసాయం గిట్టుబాటుగాక, అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014 సంవత్సరానికి ముందు భారీ సంఖ్యలో రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.’ ‘2014 తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పరిస్థితులు ఒక్కసారిగా కొలిక్కివచ్చాయి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణతో సాగునీటి వసతులు మెరుగుపడ్డాయి. వ్యవసాయం పండుగలా మారింది. క్రమంగా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సమిష్టి ప్రయత్నాలు వ్యవసాయాన్ని సులభతరంగా మార్చాయి. రైతు జీవితాలు మెరుగుపడ్డాయి. ఇది కాదా.. మానవీయ ప్రభుత్వం అంటే’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎనిమిదేండ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినట్టు తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో విడుదల చేసిన గణాంకాల చార్ట్‌ను రీ ట్వీట్ చేశారు.