Farmer Suicide | దుబ్బాక, మార్చి 12 : అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలం మంతూర్లో నెలకొంది. ఈ ఫటనకు సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంతూర్ గ్రామానికి చెందిన ఈరమైన మల్లయ్య (50) అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో తనకున్న అర ఎకరం పొలాన్ని ఇతరులకు గతేడాది కిందట అమ్మేశాడు. గ్రామానికి చెందిన మరొకరి పొలాన్ని మల్లయ్య కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో వేసిన పంట కండ్ల ముందు ఎండిపోవడంతో మానసికంగా కలత చెందాడు. దీంతో పాటు గత 6 నెలల కిందట మల్లయ్య తన కూతురు వివాహం చేశాడు. వివాహం కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఓ పక్క పెరిగిన అప్పులు, మరోపక్క ఎండిన పంటతో ఆందోళన చెందిన మల్లయ్య సోమవారం రాత్రి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి, అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మల్లయ్య కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.