కూసుమంచి, ఫిబ్రవరి 25 : పత్తికి ధర లేకపోవడం.. తెగుళ్లు సోకడం.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఖమ్మం జిల్లాలో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన బుర్రా దర్గయ్య (32) తనకున్న భూమిలో పొలంలో పత్తి పంట పండిస్తున్నాడు. దీనికితోడు గ్రామంలో ధాన్యం, పత్తి, మిర్చి క్రయవిక్రయాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో మార్కెట్లో పత్తికి రేటు లేకపోవడం, పొలానికి తెగుళ్లు సోకడం, రూ.4 లక్షల వరకు అప్పులు కావడంతో వాటిని తీర్చే మార్గంలేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.