వరంగల్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రేవంత్‌రెడ్డి వచ్చిండు. చిప్ప మా చేతికిచ్చిండు’ అని మొగిలిచర్ల మహిళా రైతు శోభ దుమ్మెత్తి పోసింది. బీఆర్ఎస్ పార్టీ ‘మార్కెట్ బాటలో భాగంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం పరకాల నియోజకవర్గంలోని మొగిలిచర్ల శివారు పత్తిచేనులో ఉన్న మహిళా రైతులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా రైతు శోభ మాట్లాడుతూ కరెంట్ కష్టాలు, సాగునీటి దుస్థితి, రైతుల పరిస్థితిపై ఆమె మాటల్లోనే.. కరెంటు ఊకె పోవుడే.. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. బిడ్డల పెండ్లి చేసిన. పిల్లలను బాగానే సదివిచ్చిన. నా కొడుకు హైదరాబాద్ హైకోర్టుల లాయర్గ జేత్తాండు. మాకు ఐదెకరాలున్నది. 8 ఎకరాలు కౌలుకు పట్టిన. మక్కజొన్న ఏసినం. కరెంటోళ్లకు ఫోన్జేత్తే ‘మూడ్రోజులదాకా మమ్ముల మందలీయకు.. ఫోన్ చేయకు’ అంటాండ్లు. మరెట్ల? అంటే ‘మమ్ములను అడుగకు పైనుంచే పోయింది. పైవోణ్నే అడుగుపో అంటాండు. లైన్మెన్కు జేత్తే ఏఈకి జేయిమంటడు. ఏఈకి జేసిన. ‘పైనుంచి పోయిందానికి నేనేం జేయాలె? మూడు రోజులు ఓపిక పట్టుకోవాలె’ అన్నడు. కేసీఆర్ ఉన్నప్పుడు అసలే పోలే. మూడు రోజులకాంచి పెరడు (మక్కజొన్న చేను) దున్నుదామంటే కరెంటు లేదు.
కేసీఆర్ ఉన్నప్పుడు కాలువ నీళ్లు వచ్చేది. ఇప్పుడు అవి కూడా బంద్ అయినయ్. యాసంగిల కూడా మేం వడ్లు అమ్మినం. బోనస్ బోనస్ అన్నరు. ఇప్పటిదాన్క బోనస్ పైసలు పడలే. వరికోత మిషన్‌కు ఎకరాన పదివేలు అడుగుతున్నరు.
కేసీఆర్ ఉన్నప్పుడు రైతులందరికీ రైతుబంధు ఇచ్చిండు. ఈ రేవంత్‌రెడ్డి వచ్చినంక వస్తలేదు. అట్లసుత లాసైనం. రెండు లక్షల రుణమాఫీ అన్నడు. ఏసినోళ్లకు ఏసిండు. మాకైతే కాలే. మేం రెండు లక్షల 20 వేలు బాకున్నం. మీది పైసలు (రూ.20వేలు) కట్టుండ్లి అన్నరు. కడ్తే ఇత్తమన్నరు. మేం 20 వేలు కడ్తమని పోతే.. తీస్కోలే. వడ్డీ కడ్తమంటే కూడా తీస్కోలే. లేదులేదు..మాకు ఆర్డర్ రాలేదన్నరు.
యూరియా బత్తాల తిప్పలంటే మామూలు తిప్పలు కాదు. నాలుగుమాట్ల పోయినం. పోలీసోళ్లు వచ్చిండ్లు. తిప్పలు పడితే ఆయినకో (భర్త) బత్త.. నాకో బత్త దొరికింది. రెండు బత్తాలు ఏం సరిపోతయని మాకు మేమే లొల్లివెట్టుకున్నం.
నిరుడు ఎకరాన 12 క్వింటాళ్ల పత్తి ఎల్లింది. ఈయేడు ఎకరాన నాలుగు క్విం టాల్లు కూడా ఎల్లేటట్టు లేదు. మందు బ త్తాల్లేక తక్కువ ఎల్లుతాంది. ఈ ఇత్తనం గూడా సక్కగ లేక కాయలే. అన్నిటికీ నష్టపోతున్నం. డూప్లికేట్ గింజలిచ్చిండ్లు. మొన్న పత్తి మార్కెట్‌కు ఏస్కపోతే సీసీఐకి అది బుక్ (కపాస్ కిసాన్ యాప్‌లో) జే యలేదు అన్నరు. మాకేం దెల్వది. మాకున్నది చిన్న సెల్లు అంటే మర్రిపోండ్లన్నరు. రోజుకు కూలి రూ. 450. అమ్మితే క్వింటాకు రూ.4500. 16 బత్తాల పత్తి మార్కెట్‌కు కొనబోతే మాకు వచ్చినయే రూ.35 వేలు. పత్తి ఏరేతందుకు కూళ్లే రూ.25 వేలు అయింది. మాకేం మిగిలింది సారూ? మందుబస్తాలేంది? మేం కౌలుపట్టిన భూమేంది? వచ్చిన పైసలు కూలోళ్లకు కూడా అయితలేవు.