కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ), కౌటాల, నవంబర్ 30 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో సంచరిస్తున్న పులి ప్రజలను హడలెత్తిస్తున్నది. శుక్రవారం గన్నారం సమీపంలో పత్తి ఏరుతున్న మోర్ల లక్ష్మిపై దాడి చేసి చంపగా, శనివారం సిర్పూర్-టీ మండలం దుబ్బగూడలో రైతు సురేశ్‌పై పంజా విసిరింది. దుబ్బగూడకు చెందిన సురేశ్, అతడి భార్య సుజాత శనివారం చేనులో పత్తి తీస్తుండగా పొదల్లో శబ్దం వినిపించింది. అడవి పందులు కావచ్చని చెదరగొట్టేందుకు సురేశ్ ఆ వైపు వెళ్లాడు. పొదల్లో రెండు పులులున్నాయని, అందులోని ఒక పులి సురేశ్‌పై దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షి సుజాత తెలిపింది. సురేశ్‌పై పులి దాడిని గమనించిన సుజాత కేకలు వేస్తూ.. అక్కడికి వెళ్లి కర్రలతో పులిని కొట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే సురేశ్ మెడపై దాడి చేసిన పులి.. అతడిని కొంత దూరం లాక్కెళ్లింది. సురేశ్ కూడా గొడ్డలితో ఎదురుదాడి చేయడం.. అదే సమయంలో చుట్టు పక్క రైతులు, కూలీలు రావడంతో పులి సురేశ్‌ను వదిలి పారిపోయింది. సురేశ్‌ను సిర్పూర్-టీ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు.
కల్యాణి కుటుంబానికి 10 లక్షలు: సురేఖ
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): పులి దాడిలో మరణించిన కాగజ్‌నగర్‌కు చెందిన కల్యా ణి కుటుంబానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.10 లక్షల పరిహారం అందించామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తాజాగా సిర్పూర్(టీ) మండలం దుబ్బగూడెంలో సురేశ్ అనే రైతుపై పులి దాడి చేయడంపై మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.