జనగామ చౌరస్తా, డిసెంబర్ 13: ‘పత్తి కొనుగోలు చేయండి మహాప్రభో’ అంటూ ఓ రైతు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. సీసీఐ అధికారులు ఎంతకూ కనికరించకపోవడంతో రైతు శుక్రవారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట పత్తి ట్రాక్టర్‌ను అడ్డుగాపెట్టి నిరసన వ్యక్తం చేశాడు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను కలిసి గోడు వెల్లబోసుకున్నాడు. స్పందించిన కలెక్టర్ వెంటనే మార్కెటింగ్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
బాధిత రైతు కట్టా పరశురాములు కథనం ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన రైతు పరశురాములు పత్తి పంట విక్రయానికి లింగాలఘనపురం మండలం నెల్లుట్ల సత్యసాయి కాటన్ మిల్ సీసీఐ కేంద్రానికి శుక్రవారం ట్రాక్టర్లో తీసుకొచ్చారు. అక్కడి సీసీఐ అధికారులు చెత్త ఎక్కువ ఉందన్న కారణంతో కొనుగోలు కుదరదని చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీఐ అధికారులు పరశురాములుకు సంబంధించిన 26 క్వింటాళ్ల పత్తిని రూ.7125 కనిష్ఠ మద్దతు ధరకు కొనుగోలు చేశారు.