బడంగ్‌పేట, నవంబర్3 : నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 92లో ఉన్న తమ భూమిని ప్రవీణ్‌రెడ్డి అనే వ్యక్తి బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని గుర్రంగూడకు చెందిన రైతు ఏ నర్సింహ ఆందోళన వ్యక్తంచేశాడు. ప్రవీణ్ రెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆదివారం మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. తాను భూమి ఇవ్వనన్నందుకు తన ఇంటి ముందు ఎక్స్‌కవేటర్‌తో కందకం తీయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు ఆదివారం సాయంత్రం గుర్రంగూడకు వచ్చి విచారణ చేస్తుండగా వారి ఎదుటే ప్రవీణ్‌రెడ్డి అనుచరులు తనను బూతులు తిడుతూ బెదిరించారని చెప్పాడు. తన ఇంటి ముందు కందకం తీయడం వల్ల బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయిందని, ఇదంతా భూమి ఇవ్వనన్నందుకే చేయిస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేశాడు.
తన తాతముత్తాల నుంచి ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్నామని, తమ భూమి ఎవరికీ అమ్మే ప్రసక్తి లేదని చెప్పాడు. అవసరమైతే తమ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవీణ్‌రెడ్డికి భూమి ఇచ్చేది లేదని తెలిపాడు. ఇప్పటికే బడంగ్‌పేట మున్సిపల్ అధికారులకు, మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రవీణ్‌రెడ్డి అనుచరులు తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు. వారిముందే బరి తెగించి మాట్లాడుతున్న సమయంలో మీర్‌పేట పోలీసులు విన్నారని, ఇదేం పద్ధతి అలా మాట్లాడొద్దని చెప్పారని వివరించాడు. బెదిరింపులకు పాల్పడుతున్న వారి నుంచి రక్షణ కల్పించాలని నర్సింహ వేడుకున్నాడు.