రాజంపేట్, జూన్ 7: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో చోటుచేసుకున్నది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్గొండకు చెందిన జంగిటి పెంటయ్య (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్ల పెండ్లి కోసం అప్పులుచేశాడు. జొన్న పంటను అమ్ముకొని అప్పులు తీరుద్దామని ఆశించాడు.
పంట దిగుబడి రాకపోవడంతో నష్టాలపాలయ్యాడు. ఒకవైపు చేసిన అప్పులు తీర్చలేక, మరోవైపు పంట దిగుబడి రాక అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పొలం వద్ద వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.