నర్సంపేట, జూలై 29 : వడ్డీ వ్యాపారుల మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిదురాల వీరస్వామి (51) మొదటి భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. మూడేండ్ల క్రితం కొడుకు హేమంత్ ఉరివేసుకొని మృతి చెందాడు. ఈక్రమంలో ఇదే గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన కందగట్ల రాధికతో రెండో వివాహం గతేడాది జరిగింది. భార్య రాధిక పేరిట ఉన్న 1.06 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరస్వామి నర్సంపేట పట్టణానికి చెందిన గుజ్జ సుజాత వద్ద ఇదే పట్టణానికి చెందిన మధ్యవర్తులైన ఓదెల విజయ్, సృజన్ సమక్షంలో రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
ఈ అప్పు కింద తన భార్య పేరిట ఉన్న 1.06 ఎకరాల భూమిని తనఖా పెట్టారు. సుజాత తనఖా పేరిట ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది తెలియని వీరస్వామి తన అప్పు తీర్చుదామని నగదుతో సుజాత, విజయ్, సృజన్ వద్దకు వెళ్లగా నీ భూమి మాకు అమ్మేశావుగా అని చెప్పగా అసలు నిజం తెలిసింది. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. భూమి తనదని, తనకు రిజిస్ట్రేషన్ చేయమని వీరస్వామి అడగగా ఆ ముగ్గురు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన వీరస్వామి సోమవారం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నర్సంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తమ్ముడు భాస్కర్ ఫిర్యాదు మేరకు సుజాత, విజయ్, సృజన్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.