Yadagirigutta | యాదగిరిగుట్ట, మార్చి 7: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన మేన బావమరిది అని, అయినా ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని రైతు ఎమ్మ బాలరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాతూ ‘నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తను. ఆలేరు ఎమ్మెల్యేగా మా మేన బావమరిది బీర్ల అయిలయ్య గెలిస్తే బాగుంటుందని భావించా. ఆయకు ఓటేసి గెలిపించాం. కానీ లాభం లేదు. కాళేశ్వరం నీళ్లందిస్తానని ప్రచారం చేసుకున్నాడు. కానీ.. ఒక్క చుక్క కూడా రాలేదు. లో ఓల్టేజీ రావడంతో మోటార్లు నడువక నాకున్న 6ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. ఇప్పటి వరకు నా బావమరిది, ఎమ్మెల్యే అయిలయ్య వచ్చి చూసిపోలేదు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి వచ్చి పరామర్శించారు. చాలా సంతోషంగా ఉంది. కేసీఆరే మా నాయకుడు’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ కావాలంటుర్రు: గొంగిడి
‘ఏ ప్రాంతానికి వెళ్లినా రైతులంతా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలంటున్నరు.. ఆయన పాలనలోనే రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకునేదని.. సారు పాలనలోనే స్వర్ణయుగంగా వ్యవసాయం సాగిందని స్వయంగా రైతులే కోరుతున్నారు.’ అని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, యువ రైతు ఎమ్మ శ్రీకాంత్ కుటుంబం బంగారు అభరణాలను కుదువబెట్టి నాలుగు ఎకరాల్లో వరి పంట వేయగా లోఓల్టేజీతో సాగు నీరందక పూర్తిగా ఎండిపోయింది. విషయం తెలుసుకున్న గొంగిడి మహేందర్‌రెడ్డి శుక్రవారం శ్రీకాంత్ వరి పంటను పరిశీలించారు.
ఆధైర్యపడొద్దని రాబోయేది కేసీఆర్ పాలనేనని, రైతులకు అండగా నిలుస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం జలాలు విడుదల చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతో నీళ్లు విడుదల చేయకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రియల్ వ్యాపారులైన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, బీర్ల అయిలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా కావడం రైతులకు శాపంగా మారిందన్నారు. కేసీఆర్ పదేండ్ల హయాంలో ఏ ఒక్కరోజూ లోఓల్టేజీ సమస్య రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 15నెలల్లో లోఓల్జేజీ వచ్చి పంటలు ఎండుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వరి పంటకు నష్టం జరిగిందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్‌గౌడ్, పార్టీ నేత సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.