అక్కన్నపేట, నవంబర్ 19: మొంథా తుపాన్ కారణంగా పంటలు దెబ్బతినడా న్ని తట్టుకోలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నా డు. కండ్ల ముందే వరిచేనంతా నేలవాలడంతో ధైర్యం కోల్పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా మంగళవారం రాత్రి మరణించాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రిక్కల శ్రీనివాస్‌రెడ్డి(54)కి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. సు మారు మూడున్నర ఎకరాల్లో వరి వేయగా, ఎకరంన్నరలో కంది సాగు చేశాడు. శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయంలో భార్య లక్ష్మి చేదోడువాదోడుగా ఉంటుంది. మొంథా తుపాన్‌తో శ్రీనివాస్‌రెడ్డి మూడున్నర ఎకరాల వరి పూర్తిగా నేలవాలింది. వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగి పంట నష్టం నమోదు చేయాలని అడిగితే కేవలం ఎకరం పది గుంటలు మాత్రమే నష్టం జరిగిందని ఆన్లైన్లో నమో దు చేశారు.
నేలవాలిన వరి చేనును కోసేందుకు వీలుకాకుండా ఉన్నది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడితే కండ్ల ముందే వరిచేను నేలకూలంది. ఇల్లు, వ్యవసాయబావి తప్ప మరో లోకం తెలియని శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ బావి వద్దనే ఈ నెల 13న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ఓ కార్పొరేటు దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మంగళవారం రాత్రి 10 గంటలకు మార్గమధ్యంలో చనిపోయాడు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి గ తంలో రూ. 6 లక్షల అప్పులు, పంట పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు, దవాఖాన ఖర్చులు రూ.7 లక్షలు, మొత్తంగా రూ. 15 లక్షల వరకు అప్పులైనట్టు అతడి భార్య లక్ష్మి తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.