రాజన్న సిరిసిల్ల, మే 19 (నమస్తే తెలంగాణ): వడ్ల కొనుగోలు కోసం ఎదురుచూస్తూ వడదెబ్బ సోకి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్కు చెందిన రాచర్ల రవి (49) ప్రాణాలు కోల్పోయాడు. రవి నెల క్రితం పెద్దూర్ స్పిన్నింగ్ మిల్లులోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. అక్కడే ఆరబెట్టి తూకం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే అకాల వర్షాలతో ధాన్యం తడవగా అక్కడే ఆరబెట్టి కొనుగోలుకు సిద్ధంచేశాడు.
రోజుమాదిరిగానే మంగళవారం సైతం కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. ధాన్యం కుప్ప చూసుకొని, ఎండలోనే పొలం పనులకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో మళ్లీ సెంటర్కు వెళ్లాడు. లారీలు లేక ధాన్యం తూకం వేయకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. మధ్యాహ్నం మండుటెండలోనే ఇంటికి చేరుకోగానే, అలిసి సొమ్మసిల్లి పడిపోయాడు. హూటాహుటిన కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.