మహబూబ్ నగర్ : ప్రభుత్వ అంబులెన్స్‌లో ( Ambulance ) ఆక్సిజన్ ( Oxygen ) లేక ఓ రైతు మృతి చెందిన సంఘటన పాలమూరు ( Palamur District ) జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మూసాపేట్ మండలం నిజాలాపూర్‌కు చెందిన రైతు భోజయ్య ( Farmer Bhojaiah) తన వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటూ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను మూసాపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించిందని పరీక్షించిన డాక్టర్లు 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. భోజయ్య ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అంబులెన్స్ లో ఆక్సిజన్ పెట్టాలని వైద్యులు సూచించి పంపించారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అంబులెన్స్ సిబ్బందిని అడిగిన వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.
అంబులెన్స్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకోగానే భోజయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో వాడే అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతోనే తమ తండ్రి చనిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.