ఫొటోలో కంటతడి పెడుతూ కనిపిస్తున్న వ్యక్తి వడ్డె చంద్రయ్య. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన రైతు. రెక్కాడితే కాని డొక్కాడని పేద కుటుంబం. సాగు కోసం బ్యాంకులో తీసుకున్న 70వేల లోన్.. కాంగ్రెస్ రుణమాఫీతో తీరుతుందని ఆశపడ్డాడు. అన్ని అర్హతలున్నా ఆయన రుణం మాఫీ కాలేదు. దిక్కుతోచక సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో విన్నవించుకుంటూ ఇలా విలపించారు.
Mahabubnagar | మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఆగస్టు 5: ‘నిరుపేదలం బిడ్డా..! పంటలు పండక దిగుబడి రాక.. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాం.. నా కొడుకు అప్పులు చెల్లించే పరిస్థితులు లేక ఉరేసుకొని కాలమయ్యాడు. కాంగ్రెసోళ్లు రుణమాఫీ చేస్తున్నామంటే ఎంతో ఆశగా బ్యాంకు కాడికి పోతే రుణమాఫీ ఇయ్యట్లేదయ్యా..’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన వడ్డే మల్కమ్మ, వడ్డె చంద్రయ్య దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తన చిన్నకుమార్తె భారతమ్మతో కలిసి ఆటోలో ప్రజావాణికి వచ్చిన ఆ వృద్ధ దంపతులు గోడు వెల్లబోసుకున్నారు.
రూ.70 వేల అప్పు ఉంటే మాఫీ కాలె
హన్వాడ మండలం గుండ్యాల శివారులో తన భార్య మల్కమ్మ పేరుపై ఎకరంన్నర పొలం, తన పేరుపై నాలుగె ఎకరాల భూమి ఉన్నదని చంద్రయ్య తెలిపారు. ఈ భూమిపై బ్యాంక్‌లో ఒకసారి రూ.30 వేలు, మరోసారి రూ.40 వేలు పంట రుణం తీసుకోగా.. మొత్తం రూ.70 వేల అప్పు ఉన్నదని చెప్పారు. రుణమాఫీ కోసం బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, రుణమాఫీ కాలేదని చెప్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తినడానికి సైతం పూటగడవని పరిస్థితులు ఉన్నాయని, కలెక్టర్, అధికారులు స్పందించి న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు.