ఆదిలాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/నేరడిగొండ : కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో వృద్ధ రైతు దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్‌లో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈదపు పోశెట్టి (60), ఇందిర (52) దంపతులు.
ఇందిర పేరిట 3.30 ఎకరాలు, పోశెట్టి పేరిట 1.28 ఎకరాల భూమి ఉన్నది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు కాగా వారి వివాహాలు చేశారు. సాగు, ఇతర ఖర్చులు కలిపి రూ.20 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. దిగుబడులు రాక, రూ.2 లక్షల రుణమాఫీ వర్తించక, రైతు భరోసా అందక అప్పులు భారంగా మారాయి. ఈ క్రమంలో వారు మంగళవారం ఇంట్లోనే పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ పోశెట్టి మృతి చెందాడు. ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
బెజ్జంకి, మార్చి 6: దిగుబడులు లేక& అప్పుల భారం మోయలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేటలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై కృష్ణారెడ్డి కథనం ప్రకారం.. ముత్తన్నపేటకు చెందిన గాజ రవి (45)కి వ్యవసాయం జీవనాధారం. ఇతడి కూతురు, కొడుకు హైదరాబాద్‌లో చదువుతున్నారు. వారి కాలేజీ ఫీజులతోపాటు వ్యవసాయానికి చేసిన అప్పులు భారంగా మారాయి. వాటిని తీర్చాలో తెలియక కుంగిపోయాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో కరీంనగర్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.