స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 7 : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్ చేదు అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే.. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం, ఉచిత కరెంటు ఇస్తున్నదని చెబుతుండగా.. అవి సరే రైతులకు యూరియా కష్టాల సంగతేందని రైతు కాసాని బొందయ్య ప్రశ్నించారు.
దీనికి కడియం సమాధానమిస్తూ రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, యూరియా కష్టాలు రాష్ట్రమంతటా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. యాసంగికి ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, మళ్లీ ఎరువుల కష్టాలు రాకుండా చూస్తానని కడియం హామీ ఇచ్చారు.
కాంగ్రెస్‌కు ఓటేయకుంటే పింఛన్లు కట్ చేస్తా.. వైరా ఎమ్మెల్యే రాందాస్ వ్యాఖ్యలు
వైరా టౌన్, డిసెంబర్ 7: ‘అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తేనే హామీలు అమలవుతాయి. సర్పంచ్ పదవులు వట్టిగనే రావు. అందుకని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతివ్వండి’ అంటూ వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన ప్రచారానికి వెళ్లిన ఆయన.. అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులకు పట్టం కట్టకపోతే పథకాలు అందవని హెచ్చరించారు.
ముఖ్యంగా బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థులను ఓడించాలని విషంగక్కారు. పైగా, వైరా మండలంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారని, కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే పింఛన్లు కట్ చేస్తామని మాట్లాడడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.