జైపూర్, ఏప్రిల్ 20 : సాగుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పౌనూరుకు చెందిన మంతెన కుమార్ (39) రెండెకరాల్లో వరి సాగు చేశాడు. నిరుడు రెండుసార్లు బోర్లు వేయించినా నీరు పడలేదు. పంట చేతికి అందక, దాదాపు రూ.4 లక్షలు అప్పుల పాలయ్యాడు. మనస్తాపం చెందిన ఆయన శనివారం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. వైద్యులు పరీక్షించి, కుమార్ మృతి చెందినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.