సిర్పూర్(టీ), నవంబర్ 1 : ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిపంట దెబ్బతినగా, మనస్తాపం చెందిన ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం చింతకుంటలో జరిగింది. సిర్పూర్(టీ) ఎస్ఐ చిప్పకుర్తి సురేశ్ కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన రైతు పిట్ట ల కృష్ణయ్య (64) తనకున్న 4 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నది.
దిగుబడి రాదేమోనన్న బెంగతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంటి సమీపంలో పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు సిర్పూర్(టీ) సామాజిక దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి కాగజ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయన భార్య దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.