కౌడిపల్లి, మార్చి 22 : నీళ్లు లేక పొలం ఎండిపోవడం, బోర్లేసినా చుక్క నీరు రాకపోవడం.. అప్పులు మీద పడటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌడిపల్లి మండలం కుషన్‌గడ్డ తండాకు చెందిన రైతు దేవుల నాయక్ (50)కు నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. కాగా మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సొంత పొలం రెండెకరాలు ఎండిపోయింది. దీనికోసం ఇటీవల మూడు బోర్లు వేయించగా, నీళ్లు పడలేదు. దీంతో రూ.3 లక్షల అప్పులు అయ్యాయి. దీంతో కొద్దిరోజులుగా దిగులుగా ఉంటున్నాడు. శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. శుక్రవారం కుటుంబసభ్యులు వెతకగా జాడ తెలియరాలేదు. శనివారం రాజిపేట శివారు అడవిలో చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
విద్యుత్తు షాక్‌తో రైతు మృతి
వెల్దుర్తి, మార్చి 22 : విద్యుత్తు మోటర్‌ను ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతిచెందాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తిలో రైతు దశరథ్ (54) శనివారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద మోటర్‌ను ఆఫ్ చేయడానికి వెళ్లగా, విద్యుత్తు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.