టేకులపల్లి, జూన్ 25 : కౌలుకు ఇచ్చిన చేనులో ఫెన్సింగ్‌కు విద్యుత్ ప్రసారం కావడంతో షాక్ తగిలి ఓ మహిళాకూలీ బుధవారం మృతిచెందిన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన మరుసటిరోజే ఆ భూమి యజమాని తన చేనులో మహిళాకూలీ మృతిచెందిందనే మనస్తాపంతో ఉరివేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడులో చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. టేకులపల్లి మండలం మొక్కంపాడు సమీపంలోని ఓ చేనులో బోడు సర్పంచ్ పొదెం స్వరూప అత్త చుక్కమ్మ (55) బుధవారం కూలి పనులకు వెళ్లింది. భూమిని కౌలుకు తీసుకున్న లాలు చేనులో పనులు చేయిస్తుండగా.. చేనుకు వేసిన ఫెన్సింగ్ దాటే క్రమంలో ఆ తీగలకు విద్యుత్ ప్రసారం కావడంతో షాక్ తగిలి చుక్కమ్మ అపస్మారక స్థితికి చేరుకున్నది.
గమనించిన తోటి కూలీలు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. బోడు గ్రామానికి చెందిన ఆ భూమి యజమాని మాడె పాపయ్య (48) తన చేనులోని ఫెన్సింగ్‌కు విద్యుత్ సరఫరా జరిగి షాక్ తగిన మహిళాకూలీ మృతిచెందడంతో తీవ్రంగా కలతచెందాడు. రాత్రంతా తీవ్ర మనస్తాపానికి గురైన పాపయ్య గురువారం తన చేను వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.