ఖానాపురం, జనవరి 10 : దిగుబడులు రాక, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతలగడ్డలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం మనుబోతలగడ్డకు చెందిన అమ్మ అశోక్ (45) ఎకరం పొలంలో ఈ ఏడాది దిగుబడి రాలేదు. పెట్టుబడితోపాటు కుటుంబ పోషణకు కలిపి మొత్తం రూ.5.5 లక్షల అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం కానరాక కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి కలుపు నివారణ మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారమిచ్చాడు. కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న అశోక్‌ను నర్సంపేటకు వైద్యశాలకు తరలించే క్రమంలో మృతిచెందాడు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రఘుపతి తెలిపారు.
పని ఒత్తిడితో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య!
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బాచుపల్లిలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ సత్యలావణ్య(32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురానికి చెందిన సత్యలావణ్య తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. సంక్రాంతికి భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బ్యాంకులో సెలవు అడిగినట్టు తెలుస్తున్నది. సెలవు మంజూరు అయిందా లేదా అనే విషయం తెలియరాలేదు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఆమె బ్యాంకు నుంచి ఇంటికి వచ్చి, ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. అప్పటికే సత్యలావణ్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువగా ఉందంటూ సత్యలావణ్య తరచుగా చెప్పేవారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బాచుపల్లి పోలీసులు తెలిపారు.